లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి

31-10-2026 | 12:21am

సాహితి జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని సాహితి జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుంచే తమ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాట విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని గుర్తించి మంచి మార్గంలో నడుస్తూ విజయాలు సాధించాలని, వారి ఆశయాలను నెరవేర్చి తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా ఎదగాలని ఆకాంక్షించారు.

మాజీ వైస్ చైర్మన్ పులిగండ్ల మాధవ్ మాట్లాడుతూ పదో తరగతి అనంతరం ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించుకున్నట్లుగానే భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరుకునేలా లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. 14వ నంబర్ బస్తీ కౌన్సిలర్ సోనీ కొరి మాట్లాడుతూ సమాజంలో మంచి స్థాయికి ఎదగాలంటే తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని తెలిపారు.

కళాశాల డైరెక్టర్ మాదినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టుదలతో చదివితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఎంసీ నాగిరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన విజయానికి కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్చి 2026 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ మెమెంటోలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కర్ణడాడి రాంబాబు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు