రైలు ఢీకొని అడవి ఏనుగు, దాని పిల్ల మృతి
పాలక్కాడ్: వలయార్-పాలక్కాడ్ అటవీ ప్రాంతంలోని(Walayar-Palakkad forest area) చవాడిప్పార వద్ద ఉన్న పుదుప్పతి సమీపంలో గురువారం తెల్లవారుజామున మంగళూరు-చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Mangaluru-Chennai Superfast Express) ఢీకొనడంతో ఒక అడవి ఏనుగు,దాని పిల్ల మరణించినట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. కేరళ-తమిళనాడు సరిహద్దులోని తమిళనాడు వైపున అర్ధరాత్రి సుమారు 12:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రెండు ఏనుగులు రైలు ఇంజిన్ కింద చిక్కుకుపోవడంతో, రైలు సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది.
వలయార్ అటవీ ప్రాంత సిబ్బందితో సహా అటవీ శాఖ అధికారులు(Forest Department officials), పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను తొలగించి మార్గాన్ని క్లియర్ చేసే పనులను పర్యవేక్షించారు. పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు, వెటర్నరీ సర్జన్‌తో కూడిన త్రిసూర్ వెటర్నరీ బృందం ఆ ప్రదేశానికి చేరుకుంది. తమిళనాడు అటవీ శాఖ అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫిబ్రవరిలో, వలయార్ సమీపంలో రైలు ఢీకొనడంతో ఏనుగు మరణించిన విషయం తెలిసిందే. ఏనుగులు, ఇతర వన్యప్రాణుల సంచారం కారణంగా రాత్రివేళల్లో ఆ మార్గంలో నడిచే రైళ్లు తక్కువ వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






