3 September, 2026 | 11:37 PM

లింగోజిగూడలో ఇంటిగ్రేటెడ్ స్కూల్

03-09-2026 | 10:49pm

- కబ్జాకు గురైన రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మాణం 

- స్కూల్ నిర్మాణానికి రూ.21 కోట్లు  మంజూరు 

- మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి

ఎల్బీనగర్: లింగోజిగూడ డివిజన్‌ కామేశ్వర్ కాలనీ సతి రెడ్డి తోటలో కబ్జాకు గురైన సర్వే నంబర్ 86లోని 1 ఎకరం 21 గుంటల ప్రభుత్వ భూమిని వెలికితీసి, సుమారు రూ.80 కోట్ల విలువైన భూమిలో రూ.21 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల(Integrated government school) నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం చేపడుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి(Former Corporator Dharpalli Rajasekhar Reddy) తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తన 15 ఏళ్ల ఎమ్మెల్యే పదవీకాలంలో ఎల్బీనగర్ నియోజకవర్గానికి(LB Nagar Constituency) ఏం చేశారో? ప్రజల సమక్షంలో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుయాష్కీగౌడ్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు చేపడుతోందని తెలిపారు. హైడ్రా(Hydra) ద్వారా రూ.88 కోట్లు, బండ్ అభివృద్ధికి రూ.6 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు, సీఎం రోడ్–బండ్ స్ట్రామ్ వాటర్ డ్రైన్‌కు రూ.6 కోట్లు, ఎస్టీపీ నిర్మాణానికి రూ.19 కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

లింగోజిగూడ డివిజన్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్ర ఏమాత్రం లేదని రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విద్యా మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.‌ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభావతి, జ్యోతి రెడ్డి, అనసూయ, సుధీర్ రెడ్డి, మనోజ్, ఉమేష్, శ్రీనాథ్, విష్ణు, అమీర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.