4 September, 2026 | 5:33 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్‌ పోరుబాట

04-09-2026 | 04:25pm

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది ఎమ్మెల్యే విజయుడు

ఎర్రవల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు(MLA Vijayudu) విమర్శించారు. బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీలు, 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ‘పోరుబాట’ కార్యక్రమం నిర్వహించారు.

అలంపూర్‌ చౌరస్తా, ఎర్రవల్లి మండల(Erravalli Mandal) కేంద్రాల్లో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిందని, అయితే 1000 రోజులు పూర్తయినా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్‌ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.