శబరిమలలో నెయ్యి స్కామ్.. మరో ఉద్యోగి అరెస్ట్!
కేరళ: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల(Sabarimala)లో వెలుగుచూసిన మిల్మా నెయ్యి కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆలయ ఉద్యోగి జయలాల్‌ను విజిలెన్స్ అధికారులు(Vigilance officials) అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన కాంట్రాక్టర్ ఎస్‌ఎస్ బిను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జయలాల్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నెయ్యి విక్రయాలు, సరఫరా వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణం కారణంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు సుమారు రూ.2.27 కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నెయ్యి విక్రయాలకు సంబంధించిన రికార్డులు, పత్రాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అక్రమాలకు ఎలా పాల్పడ్డారు? అనే కోణాల్లో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలనూ కొట్టిపారేయలేమని తెలుస్తోంది. శబరిమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో నెయ్యి విక్రయాల పేరుతో కోట్లాది రూపాయల అక్రమాలు వెలుగులోకి రావడం భక్తుల్లో చర్చకు దారితీసింది. నెయ్యి సరఫరా, విక్రయాల రికార్డుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు