సివిల్ రైట్స్ డే సందర్బంగా అవగాహనా సదస్సు

30-10-2026 | 06:04pm

చేగుంట: సివిల్ రైట్స్ డే(Civil Rights Day) సందర్భంగా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామం(Gollapally Village)లో కులవివక్ష నిర్మూలన, సామాజిక సమానత్వం, రాజ్యాంగబద్ధ హక్కులు, సామాజిక సామరస్యంపై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేగుంట, ఏఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... సమాజంలో కులం, మతం, వర్గం పేరుతో ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదని అన్నారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించే బాధ్యత కూడా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కనిపించే కులవివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, సోదరభావం, ఐకమత్యంతో జీవిస్తూ గ్రామాభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎక్కడైనా వివక్ష, అసమానతలు లేదా సామాజిక అన్యాయం జరిగినట్లయితే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సబితా జనార్దన్, రెవిన్యూ సినియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ,ఉపసర్పంచ్ గిరి బాబు,జీపీఓ గోపాల్, కానిస్టేబుల్  మహేష్, వార్డ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు