ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ ల్యాండింగ్..(వీడియో)

30-10-2026 | 06:04pm

న్యూఢిల్లీ: భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో అత్యాధునిక యుద్ధ విమానం చేరేందుకు మార్గం సుగమమవుతోంది. దేశీయంగా నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్ మెరైన్ యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ పరిణామం భారత నౌకాదళానికి కీలక ముందడుగుగా నిలిచింది. భవిష్యత్తులో ఈ యుద్ధ విమానాలను నౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు జరుగుతున్న పరీక్షల్లో ఇది ముఖ్యమైన ఘట్టం.

ప్రస్తుతం గోవాలో రఫేల్ మెరైన్ విమానాలకు సంబంధించి నౌకాదళం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై విమానం సురక్షితంగా ల్యాండ్ అవడం, అక్కడి నుంచి తిరిగి టేకాఫ్ (Take-off) కావడం వంటి కార్యకలాపాలకు అవసరమైన అనుకూలతను అధికారులు పరిశీలిస్తున్నారు. విమాన వాహక నౌకపై యుద్ధ విమానాల నిర్వహణకు అవసరమైన మార్పులు, సాంకేతిక అంశాలను కూడా అంచనా వేస్తున్నారు. రఫేల్ మెరైన్ విమానాలను భారత నౌకాదళంలో మోహరించేందుకు సిద్ధం చేయడమే ఈ పరీక్షల ప్రధాన లక్ష్యం.

భారత నౌకాదళ శక్తిని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్‌తో గతేడాది సుమారు రూ.63 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొత్తం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 22 సింగిల్ సీటర్ యుద్ధ విమానాలు, నాలుగు ట్విన్ సీటర్ శిక్షణ విమానాలు ఉన్నాయి.

ఈ ఒప్పందంలో యుద్ధ విమానాలతో పాటు ఆధునిక ఆయుధాలు, సిమ్యులేటర్లు, పైలట్లకు శిక్షణ, అవసరమైన విడిభాగాలు, ఇతర సాంకేతిక పరికరాలు, లాజిస్టిక్స్ మద్దతు కూడా ఉన్నాయి. ఒప్పందం ప్రకారం 2030 నాటికి మొత్తం 26 యుద్ధ విమానాల సరఫరా పూర్తికావాల్సి ఉంది. వీటిని నడిపే భారత నౌకాదళ పైలట్లకు భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా శిక్షణ అందించనున్నాయి.

రఫేల్ మెరైన్ విమానాలు నౌకాదళంలోకి అందుబాటులోకి వస్తే సముద్ర మార్గాల్లో భారత రక్షణ సామర్థ్యానికి మరింత బలం చేకూరనుంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో ఈ యుద్ధ విమానాల అనుసంధాన ప్రక్రియలో తాజా ల్యాండింగ్ (Landing) కీలక మైలురాయిగా నిలిచింది. నౌకాదళ ఆధునికీకరణలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది

మరిన్ని వార్తలు