ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని సరోజినాపురం గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాల(MPPS School)ను అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువులో ప్రతిభను తెలుసుకునేందుకు స్వయంగా వారితో మాట్లాడి బోర్డుపై పదాలు వ్రాయించారు. అలాగే పుస్తకాల్లోని పాఠాలను చదివించారు. విద్యార్థులు చక్కగా చదువుతూ మంచి ప్రతిభ కనబరచడంతో వారిని అభినందించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారి ప్రతిభను వెలికితీస్తున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదే విధంగా నిరంతరం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.