ప్రయాణికులకు షాక్.. ఫ్లైట్స్ బంద్

31-10-2026 | 07:22am

సౌదీ అరేబియాకు నవంబర్ 14 వరకు విమానాలు రద్దు.. ప్రయాణికులకు రీఫండ్!

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో భారత్ నుంచి సౌదీ అరేబియాకు నడిచే విమాన సర్వీసులపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు సౌదీలోని మూడు ప్రధాన నగరాలకు విమాన రాకపోకలను నవంబర్ 14, 2026 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్ 30న ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. తాజా నిర్ణయంతో జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే ప్రయాణికులు మరికొన్ని రోజులు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మూడు నగరాలకు ఫ్లైట్స్ రద్దు..

గతంలో రియాద్, దమ్మామ్ నగరాలకు విమాన సర్వీసులను నవంబర్ 7 వరకు రద్దు చేయగా, జెడ్డాకు అక్టోబర్ 31 వరకు నిలిపివేశారు. తాజాగా ఈ గడువును నవంబర్ 14 వరకు పొడిగించారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, విమాన కార్యకలాపాలకు ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. సౌదీ అరేబియాలో విమానాశ్రయాలు సహా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు వస్తున్న వార్తలు కూడా Aviation Safetyపై ఆందోళనలు పెంచుతున్నాయి.

ప్రయాణికులకు రీబుకింగ్, పూర్తి రీఫండ్..

విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఊరటనిచ్చింది. అక్టోబర్ 30 లేదా అంతకంటే ముందు Confirmed Booking చేసుకుని, నవంబర్ 14లోపు ప్రయాణించాల్సిన అర్హులైన ప్రయాణికులకు One-time Complimentary Rebooking సదుపాయం కల్పించింది. సీట్ల లభ్యతను బట్టి నవంబర్ 29, 2026 వరకు ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ప్రయాణం రద్దు చేసుకోవాలనుకునేవారికి పూర్తి Refund పొందే అవకాశం కూడా కల్పించింది. ఎయిర్ ఇండియా ప్రయాణికులు సౌదీ అరేబియాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తమ సంస్థకు చెందిన ఇతర విమానాశ్రయాల నుంచి ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు అందుబాటులో ఉన్న ఆ సంస్థ స్టేషన్లతో పాటు బహ్రెయిన్‌లోని ఎంపిక చేసిన సర్వీసులను కూడా పరిశీలించవచ్చు. అయితే Rebooking సదుపాయం సీట్ల లభ్యత, సంస్థ నిబంధనలకు లోబడి ఉంటుంది.

ఇండిగో, ఆకాసా ఎయిర్ కూడా కీలక నిర్ణయం..

ఎయిర్ ఇండియాతో పాటు ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా సర్వీసులను నిలిపివేశాయి. ఇండిగో సంస్థ జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు విమాన రాకపోకలను నవంబర్ 14 వరకు రద్దు చేసింది. మరోవైపు ఆకాసా ఎయిర్ రియాద్‌కు వెళ్లే విమానాలను నవంబర్ 30 వరకు, జెడ్డా సర్వీసులను నవంబర్ 10 వరకు నిలిపివేసింది. పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు విమాన కార్యకలాపాలపై ఆంక్షలు కొనసాగవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియాకు ప్రయాణించాలనుకునేవారు టికెట్లు బుక్ చేసుకునే ముందు సంబంధిత Airlines అధికారిక Updates పరిశీలించడం మంచిది.

మరిన్ని వార్తలు