చిన్నకాపర్తిలో ఎఫ్ పి ఓ సభ్యత్వంపై రైతులకు అవగాహన
చిట్యాల, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): చిట్యాల మండలం చిన్నకాపర్తి (Chinnakaparthi)గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్ పి ఓ ) (Farmer Producer Organization) సభ్యత్వం, సహకార సంఘాల ద్వారా రైతులకు అందే ప్రయోజనాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఏసిఎస్ చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్ పి ఓ లో (Farmers FPO) సభ్యులుగా చేరడం ద్వారా సమష్టిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు, మార్కెటింగ్‌లో మెరుగైన అవకాశాలను పొందవచ్చని తెలిపారు.
రైతుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎఫ్ పి ఓ ల ద్వారా రైతులు సమష్టిగా పనిచేసి తమ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను పొందడంతో పాటు, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితరాలను సమష్టిగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పిఏసిఎస్ డైరెక్టర్ బోయపెల్లి స్వామి, వార్డు సభ్యులు, పిఏసిఎస్ సీఈఓ రాజు రెడ్డి, ఎఫ్ పి ఓ సీఈఓ వీరేష్ తదితరులు పాల్గొన్నారు.