ఇది భూ భారతి కాదు భూ హారతి అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫైర్
జనగామ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy)పై చేసిన భూ ఆరోపణలకు బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ఇచ్చాయి. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ విద్య, వైద్యం, అభివృద్ధి విషయంలో జిల్లా కు ఎంతో చేస్తున్నారు.
ఆయన చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు చేస్తున్నారు. నిజంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి భూములు కబ్జా చేస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరు దోషులో తేలుతుంది. కాంగ్రెస్ తెచ్చిన భూ భారతి వల్ల రైతులకు న్యాయం జరగడం లేదు. ఇది భూ భారతి కాదు, భూ హారతి. పేదల భూములకు హారతి పట్టే కార్యక్రమమే ఇది" అని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.