వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు..

18-09-2026 | 08:59pm

* ఘనంగా నిమజ్జన శోభాయాత్ర... భక్తిశ్రద్ధలతో పూజలు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకల(Sri Vishwakarma Jayanti Celebrations)ను శుక్రవారం ఆదిలాబాద్‌ లో వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్ లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ నేత గండ్రత్ సుజాత, బీజేపీ నాయకులు పాయల్ శరత్, నగేష్, బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు తదితరులు పాల్గొని విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారీ శోభాయాత్ర...

జయంతి వేడుకల్లో భాగంగా విశ్వకర్మ విగ్రహ నిమజ్జన భారీ శోభాయాత్ర నిర్వహించారు. సెంట్రల్ గార్డెన్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర నేతాజీ చౌక్, వినాయక్ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా చందా వాగు వరకు కొనసాగింది.

శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, నృత్యాలతో సందడి చేశారు. దారి పొడవునా భక్తి గీతాలు ఆలపిస్తూ, విశ్వకర్మ భగవానుడి నామస్మరణతో ఉత్సాహంగా ముందుకు సాగారు. దీంతో ఆదిలాబాద్ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది.

కార్యక్రమంలో విశ్వకర్మ మరాఠీ వడ్రంగి సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్వె సంతోష్, ప్రధాన కార్యదర్శి దిలీప్ తో పాటు వివిధ మండలాలకు చెందిన సంఘం నాయకులు, కులస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు