మెగా జాబ్ మేళాకు ఏర్పాట్లు పూర్తి
పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎమ్మెల్యే పద్మావతి
కోదాడ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్ ఆవరణలో నేడు శనివారం జరగనున్న మెగా జాబ్ మేళా(Mega Job Mela)కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్(District Collector Tejas Nandalal Pawar) అన్నారు. శుక్రవారం ఆయన సీసీ రెడ్డి కాన్వెంట్ ఆవరణలో జరుగుతున్న జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. సుమారు 400 కంపెనీలకు పైగా ప్రతినిధులు హాజరై తమకు అవసరమైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారని తెలిపారు. జాబ్స్ ఆధారంగా కౌంటర్లు ఎ బ్లాక్ నుండి ఎఫ్ బ్లాక్లుగా విభజించామన్నారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు కనీస సౌకర్యాలు తాగునీరు, మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 45 వేల మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాగా ఎమ్మెల్యే పద్మావతి హాజరై ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి ఉత్తమ్ చొరవతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.