కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను కలిసిన సీఎం రేవంత్

18-09-2026 | 01:22pm

హైదరాబాద్: తెలంగాణ పర్యటన నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy ) శుక్రవారం కలిశారు. పీఎంఏవై జీ పథకం(PMAY G Scheme)లో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రికి ముఖ్యంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. 11,56,915  అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో వినతి పత్రం అందజేసిన సీఎం, రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి వివరించి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం(Agriculture)లో విద్యుత్ వినియోగం పెరిగిందని వెల్లడించారు. ఎల్నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని, వ్యవసాయ రంగంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని రేవంత్ విజ్ఞాప్తి చేశారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామని, 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని, పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని ముఖ్యమంత్రి వివరించారు.   ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు