నర్సాపూర్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన ఎస్‌ఈ బిక్షపతి

06-10-2026 | 06:55pm

విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై అధికారులతో సమీక్ష

ములుగు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్‌ అందేలా చర్యలు చేపట్టాలని ఎస్‌ఈ ఆపరేషన్ బి.బిక్షపతి(SE B. Bhikshapati) అధికారులను ఆదేశించారు. మంగళవారం ములుగు డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ సెక్షన్‌లో ఉన్న నర్సాపూర్ సబ్‌స్టేషన్‌ను కన్న రాజు డీఈ టెక్నికల్, ఆపరేషన్ ములుగుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌లోని విద్యుత్‌ సరఫరా పరిస్థితి, పరికరాల పనితీరు, లోడ్ స్థితిగతులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్‌ పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, ఏవైనా లోపాలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

విద్యుత్‌ అంతరాయాలు, లో-వోల్టేజ్‌ లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేలా సమన్వయంతో పనిచేయాలని ఎస్‌ఈ సూచించారు. విఫలమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఆలస్యం లేకుండా మార్చి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని తెలిపారు. విద్యుత్‌ మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.

మరిన్ని వార్తలు