రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
లస్మన్న కుటుంబానికి తక్షణం రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు అక్టోబర్ 6(విజయక్రాంతి): పంట దిగుబడి రాదన్న ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న మండల కేంద్రానికి చెందిన రైతు కాడే లస్మన్న కుటుంబాన్ని మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Boath MLA Anil Jadhav) పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడుతూ..
లస్మన్న కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు బీమా సమర్థవంతంగా అమలు చేయకపోవడం, రైతులకు సకాలంలో రైతుబంధు, ఎరువులు అందకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్న పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. రైతులు అధైర్యపడవద్దని, రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.