రామప్పలో వేలం పాటకు బ్రేక్..!

30-10-2026 | 03:23pm
  1. పంచాయతీ పాలకవర్గం, దేవాదాయ శాఖ మధ్య వాగ్వాదం
  2. రంగంలోకి రెవెన్యూ, పోలీస్ అధికారులు

వెంకటాపూర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయం(Ramappa Temple) వద్ద నిర్వహించాల్సిన వేలం పాట వాయిదా పడ్డాయి. ఆలయానికి సంబంధించిన కొబ్బరికాయలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయంతో పాటు దుకాణ సముదాయాలు, పార్కింగ్ స్థలాల వేలం నిర్వహణపై పంచాయతీ పాలకవర్గం, దేవాదాయ శాఖ మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర వాగ్వివాదానికి దారితీశాయి.

ఆలయ ఆదాయంలో వాటా, నిర్వహణ బాధ్యతల విషయంలో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వేలం పాట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, పంచాయతీ పాలకవర్గం, దేవాదాయ శాఖ ప్రతినిధుల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే వేలం పాటల ప్రాంగణానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేలం పాటలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు వర్గాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించిన అనంతరం తిరిగి వేలం పాటలు నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ ప్రకాష్, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్, దేవాదాయ శాఖ సిబ్బంది, పాలంపేట గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు