కమల్‌ హాసన్‌.. సండియార్‌ టైటిల్‌పై వివాదం

11-11-2026 | 02:05pm

తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కొత్త సినిమా టైటిల్‌ తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. తన 72వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌ 7న ప్రకటించిన ‘సండియార్‌’ (Sandiyaar) సినిమా పేరుపై వివాదం మొదలైంది. ఈ టైటిల్‌ కుల, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ఉందంటూ పుదియ తమిళగం (Puthiya Tamilagam) పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పుదియ తమిళగం పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కె. కృష్ణస్వామి ఈ పేరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలోనూ ఇదే టైటిల్‌ వివాదానికి కారణమైందని గుర్తుచేశారు. ఇలాంటి పేర్లు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ‘సండియార్‌’ అనే సినిమా పేరు తమిళనాడులో వివాదానికి దారితీసింది. అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సినిమా టైటిల్‌ను మార్చిన విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పుడు కమల్‌ హాసన్‌ అదే పేరును ప్రకటించడంతో పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఈ వివాదంపై కమల్‌ హాసన్‌ లేదా ఆయన సినిమా బృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. టైటిల్‌ను కొనసాగిస్తారా? అభ్యంతరాలపై వివరణ ఇస్తారా? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. సినిమా ప్రకటనతో మొదలైన చర్చ రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని వార్తలు