చోరీలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్, రిమాండ్
ఘట్ కేసర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): పోచారం ఐటీ కారిడార్(Pocharam IT Corridor) పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్న నిందితుడి పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ కు తరలించారు. సీఐ డాక్టర్ జి. జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం
అలుగుబెల్లి రాము అలియాస్ జయరాంరెడ్డి (29) నివాసం ప్రకాష్ నగర్ కాలనీ, ఆర్జికె, అన్నోజీగూడలో నివాసం ఉంటున్నాడు. స్థిర నివాసం జువ్విగూడెం, నార్కెట్ పల్లి, నల్గొండ జిల్లా నివాసి గతంలో డెక్సన్ కంపెనీలో లీడ్ కన్సల్టెన్సీగా ఉద్యోగం చేసి, ఆన్‌లైన్ పెట్టుబడుల్లో నష్టపోయిన అనంతరం ఆర్థిక ఇబ్బందులు, లేఆఫ్ కారణంగా ఉద్యోగం పొగా దొంగతనాలకు అలవాటుపడి 2026 ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్య నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 5, చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో 1, నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, కట్టంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మొత్తం 9 తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. అలాగే 2026 ఆగస్టు 23 న తెల్లవారు జామున ప్రకాష్ నగర్ కాలనీ, అన్నోజీగూడ లోని నిందితుని నివాసం పక్కనే ఉన్న తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి మొత్తం 14 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2వేలు నగదు చోరీ చేసినట్లు తెలిపారు.
ఈనెల 5వ తేదీన జోడిమెట్ల చౌరస్తా సమీపంలో బంగారు బిస్కెట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని అతని వద్ద నుండి 20 గ్రాముల బరువున్న ఒక మలబార్ బంగారు బిస్కెట్, మొత్తం 60 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కెట్ ముక్కలు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. మిగిలిన బంగారు ఆభరణాలు తన నివాసం వద్ద నుండి స్వాధీనం చేసుకోవటం జరిగిందని, నిందితున్ని మంగళవారం సాయంత్రం జ్యూడిషియల్ రిమాండ్ తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.