బాణసంచా దుకాణాలను ఇన్ స్పెక్టర్ ఆకస్మిక తనిఖీ
భద్రతా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
ఘట్ కేసర్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణసంచా దుకాణాల వద్ద ఇన్ స్పెక్టర్ పి. కిరణ్(Inspector P. Kiran) శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భద్రతా నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక బాణసంచా దుకాణాలను ఘట్కేసర్ సీఐ కిరణ్ తమ పోలీసు బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈసందర్భంగా దుకాణాల వద్ద అమర్చిన భద్రతా ఏర్పాట్లు, నిల్వ ఉంచిన సామగ్రి, అగ్నిమాపక రక్షణ పరికరాలను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం వ్యాపారులకు పలు కీలక ఆదేశాలు, కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. పోలీసు, అగ్నిమాపక శాఖల నుండి సరైన అనుమతి పత్రాలు ఉన్న దుకాణదారులు మాత్రమే విక్రయాలు జరపాలన్నారు.
ప్రతి దుకాణం వద్ద అగ్నిమాపక యంత్రాలు, నీటి బకెట్లు, ఇసుక బకెట్లను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని, దుకాణాల మధ్య తగినంత ఖాళీ స్థలం పాటించాలన్నారు. విద్యుత్ తీగలు లూజుగా లేకుండా పటిష్టమైన వైరింగ్ మాత్రమే ఉపయోగించాలని, దుకాణాల పరిసరాల్లో ధూమపానం చేయడం, బహిరంగ మంటలు వెలిగించడం పూర్తిగా నిషేధం అన్నారు.
నిబంధనల ప్రకారం అనుమతించిన పరిమాణంలోనే బాణసంచాను నిల్వ ఉంచాలని, అధికంగా నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా విక్రయాలు జరిపినా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా షాపు సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత మా ప్రథమ కర్తవ్యం అని ప్రజలు కూడా లైసెన్స్ పొందిన దుకాణాల వద్దే జాగ్రత్తగా కొనుగోలు చేసి, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఇన్ స్పెక్టర్ కిరణ్ ప్రజలకు సూచించారు.