ఎల్నినో ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొందాం
తాగునీటి అవసరాలకు రూ.85 లక్షల కేటాయింపు
చౌటుప్పల్: చౌటుప్పల్ పురపాలక సంఘం(Choutuppal Municipality) ప్రత్యేక కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. రానున్న ఎల్నినో ప్రభావంతో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రూ.85 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొత్త బోర్లు, మోటార్లు, పైప్లైన్ల ఏర్పాటు, ప్రైవేటు బోర్ల లీజు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఈ నిధులు వినియోగించనున్నారు.
అలాగే పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, ఊర చెరువు పూడికతీత తదితర అభివృద్ధి పనులకు రూ.1.06 కోట్లకు పైగా, కార్యాలయ నిర్వహణ, ఇతర అవసరాలకు రూ.28.27 లక్షలు కేటాయించారు. మొత్తం రూ.2.28 కోట్ల నిధుల వినియోగానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.