సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
లక్షేట్టిపేట, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట(Luxettipet) పట్టణంలోని ఎస్‌పీఆర్ గార్డెన్‌లో లబ్ధిదారులకు ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఈ గడ్డ మీదే పుట్టిన, ఇక్కడే ప్రజా సేవలో నా ప్రాణం విడుస్తా కానీ ఎవరి ముందు తల వంచను అని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇప్పటి వరకు అత్యధిక కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఘనత తనకే దక్కిందన్నారు. కల్యాణ లక్ష్మి 3085, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ సుమారు 3533 చెక్కులతో పాటు దాదాపుగా పేదల చికిత్స కోసం 700 ఎల్‌ఓసీలను కూడా అందజేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిని నేడు మోడల్ హాస్పిటల్‌గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తున్నారంటే వైద్య సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల కోసం ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.
గూడెం రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరానికి ధీటుగా నిలబెడతామని వివరించారు. అదే విధంగా రైతుల పంటలకు నష్టం జరుగకుండా సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 312 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నాయకులతో కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్‌పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు పూర్ణ చందర్ రావు, ఆరీఫ్, పింగళి రమేష్, నలిమేల రాజు, షాహిద్ అలీ, గడ్డం త్రిమూర్తి, తూముల నరేష్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.






