6 September, 2026 | 9:46 PM

లాక్రోస్‌లో వాడపల్లి విద్యార్థినికి కాంస్యం.. అభినందించిన మంత్రి పొన్నం

06-09-2026 | 08:47pm

దామరచర్ల, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బీసీ గురుకుల విద్యార్థినులు(BC Residential School Student) సత్తా చాటారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ ఛాంపియన్‌షిప్ 2026లో గురుకుల విద్యార్థులైన పి. గోపిక, సంగీతల జట్టు తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల(Sportsmen)తో పోటీపడి దేశానికి, రాష్ట్రానికి, బీసీ గురుకుల సొసైటీకి పేరు తీసుకురావడం గర్వకారణమని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగుల సైదులు అన్నారు.

గోపిక, సంగీతలకు లాక్రోస్ క్రీడలపై ఉన్న ఆసక్తిని గుర్తించి శిక్షణ అందించామని చెప్పారు. కర్నూలు, చెన్నైలో జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఇద్దరూ బంగారు పతకాలు సాధించారని, ఆగ్రా, జమ్ము కాశ్మీర్‌లో జరిగిన పోటీలలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. 

గోపిక, సంగీతలతో పాటు వారికి శిక్షణ అందించిన ఫిజికల్ డైరెక్టర్లు అంజలి, మమత, శోభ, లాక్రోస్ శిక్షకులు శివకుమార్, ఆకాష్, ప్రిన్సిపాల్ శ్రీలతలను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు పి. హనుమంతరావు అభినందించారు.

ఈ సందర్భంగా గోపిక స్వగ్రామమైన వాడపల్లిలో సంతోషకర వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించి దేశానికి, రాష్ట్రానికి మరియు ఊరికి మంచి పేరు తీసుకొచ్చినందుకు రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు వారికి, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు