6 September, 2026 | 9:45 PM

100 మంది గర్భిణులకు ఘన సీమంతం

06-09-2026 | 08:41pm

గడ్డం యాదగిరి జన్మదిన వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని ఆశీర్వాదం

పౌష్టికాహారమే తల్లి–బిడ్డల ఆరోగ్యానికి మూలం : మంత్రి సీతక్క

ఉప్పల్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): సామాజిక సేవా కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్‌(Oxford Grammar School)లో 100 మంది గర్భిణీ మహిళలకు ఘనంగా సీమంతం వేడుకలు నిర్వహించారు. చర్లపల్లిలోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్మన్ గడ్డం యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక, సాంప్రదాయ వాతావరణంలో జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ మహిళలకు సీమంతం నిర్వహించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భధారణ సమయంలో తల్లుల ఆరోగ్యం అత్యంత కీలకమని, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తాడని పేర్కొన్నారు. ఫాస్ట్‌ఫుడ్, కల్తీ ఆహారాలకు దూరంగా ఉండి ఇంట్లో తయారుచేసిన పోషకాహారం, పండ్లు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహాలు పాటిస్తూ ప్రతిరోజూ తేలికపాటి నడక, వ్యాయామం చేయాలని, మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్లు తదితర సంక్షేమ సేవలను ప్రతి అర్హుడు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యురాలు సరిత, యూపీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక, చర్లపల్లి సీఐ సుధాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గడ్డం యాదగిరికి ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.







మరిన్ని వార్తలు