6 September, 2026 | 7:03 PM

వినూత్న బోధనలకు ఉపాధ్యాయుడు రామకృష్ణకు అవార్డు

06-09-2026 | 05:50pm

కామారెడ్డి, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థి వికాసమే లక్ష్యంగా వినూత్న బోధనా పద్ధతులతో సేవలందిస్తున్న కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల(Malla Reddy Boys' High School) గణిత శాస్త్ర ఉపాధ్యాయులు విజయగిరి రామకృష్ణకు ‘భారత్ గురు రత్న అవార్డు(Bharat Guru Ratna Award)–2026’ లభించింది. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ స్థాయి అవార్డు ప్రదానోత్సవంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ డా. పట్నం కమల మనోహర్ చేతుల మీదుగా రామకృష్ణ అవార్డును అందుకున్నారు.

కృత్యాధారిత, అనుభవపూర్వక బోధనతో పాటు వేదగణితాన్ని ఉపయోగిస్తూ విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందిస్తున్నారు. జాతీయ ప్రతిభా పురస్కారాలు, ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్‌గా ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అనుభవాలను పంచుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొంటూ విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్నారు. రామకృష్ణకు అవార్డు లభించడంపై ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు