6 September, 2026 | 10:34 PM

మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ సక్సెస్

06-09-2026 | 09:18pm

తుమ్మలచెరువు రైతుల సాగునీటి కలకు సాకారం

అశ్వాపురం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తుమ్మలచెరువు(Thummalacheruvu) రైతుల చిరకాల సాగునీటి కల సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు గ్రామంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌కు అనుబంధంగా నిర్మించిన మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్(Marellapadu Lift Irrigation) ద్వారా తుమ్మలచెరువుకు నీటిని ఆదివారం విడుదల చేస్తూ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు లిఫ్ట్ ఇరిగేషన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ లెఫ్ట్ కెనాల్ ద్వారా తుమ్మలచెరువుకు నీళ్లు విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నో ఏళ్లుగా తుమ్మలచెరువు కింద రైతులు ఎదురుచూస్తున్న సాగునీటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి జలాలను తుమ్మలచెరువుకు తరలించి రైతులకు సాగునీరు అందించాలన్న ఆకాంక్షను నెరవేర్చేందుకు అధికారులతో సమన్వయం చేస్తూ ప్రత్యేక చొరవ తీసుకున్నామని తెలిపారు.

మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్‌లో నీటి విడుదలకు 1.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను వినియోగించగా, ఒక్కో మోటారు ద్వారా 5.005 క్యూసెక్కుల నీటి విడుదల, 40 మీటర్ల డిశ్చార్జ్ వాటర్, 2.4 కిలోమీటర్ల ప్రెజర్ మేరకు నీటిని తరలించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.

ట్రయల్ రన్ విజయవంతం కావడంతో తుమ్మలచెరువు ఆయకట్టు పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రైతులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీతారామ ప్రాజెక్టు అధికారులు, సిబ్బందికి స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోదావరి జలాలు తమ పొలాలకు చేరి పచ్చని పంటలు పండే పరిస్థితులు ఏర్పడటం తమకు ఎంతో సంతోషకరమైన విషయమని, సాగునీటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన తమ చిరకాల కోరిక నెరవేరిన రోజుగా ఈ సందర్భంగా రైతులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు ఎస్‌ఈ కె. మహేశ్వరరావు, ఈఈ టి. వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్‌బాబు, గాదె కేశవరెడ్డి, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, ఉసా అనిల్, వేములపల్లి రమేష్, మట్ట వీరభద్రరెడ్డి, కందిమల్ల రామ్‌రెడ్డి, తెల్లం వీరభద్రం, సర్పంచులు మచ్చ నరసింహారావు, ఎట్టి నరేష్, సబ్కా పిచ్చయ్య, కుంజ జాను, కాకా రాములు, రావులపల్లి నరసింహారావు, బొబ్బల నాగేశ్వరరావు, గొల్లపల్లి నరేష్, వేముల విజయ్, భరస్ సంపత్, వంగూరి మధు, బేతం రామకృష్ణ, సామకూరి వెంకన్న, మంగపతి తదితరులతో పాటు తుమ్మలచెరువు ఆయకట్టు పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు