విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలి:డిసిపి భూక్య రామ్‌రెడ్డి
చిన్న వయసులోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సుల్తానాబాద్, సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): విద్యార్థులు చిన్నతనం నుండే లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేలా కృషి చేయాలని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి(DCP Bhukya Ram Reddy) అన్నారు. ఆదివారం తమ సొంత గ్రామంలో విద్యను అభ్యసించిన ప్రభుత్వ హైస్కూల్ పాఠశాల(Government High School), రాజన్న సిరిసిల్ల జిల్లా గర్జనపల్లి విద్యార్థుల కోరిక మేరకు పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న రామ్ రెడ్డి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు విద్యార్థులను విహారయాత్రకు తీసుకువచ్చారు.
ముందుగా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు ఓపెన్ హౌస్‌పై సీఐ పొన్నమనేని రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్, జూలపల్లి ఎస్సై మల్లేష్, సుల్తానాబాద్ అదనపు ఎస్సై అశోక్ రెడ్డిలు విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఫిర్యాదులు, రిసెప్షన్ కౌంటర్, రైటర్ రూమ్, సీఐ విధులు నిర్వహించే ఛాంబర్‌తో పాటు ఎస్సై విధులు నిర్వహించే ఛాంబర్, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించే ప్రదేశాలను విద్యార్థులకు చూపిస్తూ క్షుణ్ణంగా వివరించారు. అనంతరం నిందితులను ఉంచే గదులతో పాటు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను విద్యార్థులకు చూపిస్తూ వివరించారు.
అనంతరం డీసీపీ భూక్య రామ్ రెడ్డి విద్యార్థులను పోలీస్ స్టేషన్‌లో చూసిన వాటిపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వివిధ ప్రశ్నలు వేయగా వాటికి సమాధానాలు ఇచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ తమ సొంత గ్రామంలో తాను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు తమ పరిధిలోని వివిధ ప్రాంతాలపై అవగాహన కల్పించి, శ్రీ భూమా నాయక్ భూక్య సామాజిక సేవ సంస్థ, శ్రీ సీతారాం నాయక్ తండ, గర్జనపల్లి అధ్యక్షురాలు విజయ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుండి లక్ష్యాన్ని ఎంచుకొని దానిని చేరుకునేలా విద్యను అభ్యసించాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి చట్టాలు, న్యాయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు తమ సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
అనంతరం విద్యార్థులతో కలిసి పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం, డీసీపీ కార్యాలయం, ఎన్టీపీసీలను సందర్శించడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గర్జనపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోలీసులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.






