6 September, 2026 | 10:35 PM

అడవి పందుల వేటకు నాటు బాంబులు.. ముగ్గురి అరెస్ట్

06-09-2026 | 09:25pm

బోధన్, సెప్టెంబర్ 06 (విజయ క్రాంతి): అడవి పందులను వేటాడేందుకు నాటు బాంబులు అమర్చిన ముగ్గురు వ్యక్తులను బోధన్ రూరల్ పోలీసులు(Bodhan Rural Police) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై క్రైం నం. 190/2026 కింద సెక్షన్ 110 బీఎన్‌ఎస్, సెక్షన్ 5 ఎక్స్‌ప్లోసివ్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్, సెక్షన్ 9-బీ ఎక్స్‌ప్లోసివ్స్ యాక్ట్(Explosives Act) కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులను ఆచన్‌పల్లి, బోధన్‌కు చెందిన ద్యవనమైన మైసయ్య (26), మాసరొల్ల దత్తు (25), ఎరగాదిండ్ల గంగయ్య అలియాస్ గంగాధర్ (36)గా గుర్తించారు. సెప్టెంబర్ 4న ఉదయం సుమారు 10 గంటలకు పెంటకుర్దు గ్రామ శివారులోని నాగోరా ప్రాంతం సర్వే నంబర్ 10/2/A1 వ్యవసాయ పొలంలోకి వెళ్లిన ఫిర్యాదుదారు.. పొలాల గట్ల వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించారు. వారిని ప్రశ్నించగా అడవి పందులను చంపేందుకు పొలాల గట్లపై నాటు బాంబులు అమర్చినట్లు తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసుపై బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 5న సాయంత్రం సుమారు 6.30 గంటలకు అమ్దాపూర్ గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. పోలీసులను గమనించిన వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వారిని పట్టుకుని తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న కవర్‌లో మూడు నాటు బాంబులు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను నిబంధనల ప్రకారం సంబంధిత నిపుణుల ద్వారా పరిశీలన, పరీక్షలకు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పోలీస్ హెచ్చరిక: అడవి పందులు లేదా ఇతర వన్యప్రాణులను వేటాడేందుకు నాటు బాంబులు, పేలుడు పదార్థాలు లేదా ఇతర ప్రమాదకర పద్ధతులను ఉపయోగించడం వల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, సాధారణ ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి పేలుడు పదార్థాలు కనిపిస్తే వాటిని తాకకుండా, తరలించకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్వయంగా వాటిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించకూడదని తెలిపారు.

మరిన్ని వార్తలు