6 September, 2026 | 10:19 AM

పాండవుల గుట్టల్లో గుడ్‌నైట్!

06-09-2026 | 05:15am

పచ్చని చెట్లు, గలగల పారేటి జలసవ్వడులు, పండు వెన్నెలలో సేద తీరడం అంటే అందరికీ ఇష్టమే. ఉరుకులు, పరుగుల నేటి సమాజంలో అంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని (A peaceful atmosphere) అందరూ కోరుకుంటారు. అందులో ఒక రాత్రి బస చేయడానికి పరుగులు తీస్తుంటారనడంలో ఆశ్చర్యం అవసరం లేదు.

అంతగా ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్న ప్రాంతం పాండవుల గుట్టలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులో ప్రకృతి నడుమ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చారిత్రక ప్రాశస్త్యం.. ఎత్తయిన గుట్టలు, పచ్చని ప్రకృతి, జలజల సవ్వడుల జలపాతాలు, పక్షుల కిలకిలరావాలు పర్యాటకులను ముగ్ధులను చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితానికి కాసేపు విరామం ఇచ్చి ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ, ఎకో టూరిజం చర్యలు చేపట్టాయి. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చాయి.  అన్నింటికి  మించి.. ఇంకా రాత్రి బస చేసే సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రకృతి మధ్య రాత్రి బస

పచ్చని చెట్లు, ప్రకృతి సోయగాల మధ్య రాత్రి వేళ బస చేసేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. మూడు ఎకరాల విస్తీర్ణంలో డీఎంఎఫ్టీ, ఎకో టూరిజం నిధులు రూ.18 లక్షలతో నైట్ క్యాంపింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు.  ఇందుకు మోడల్ టెంట్లు ఏర్పాటు చేశారు. రెండు ఆధునిక వంటశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి వసతి కల్పించారు. అడవి నుంచి వన్యప్రాణులు, పాములు క్యాంపింగ్ ప్రాంతంలోకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టారు.

అడవిలో ఉన్న అనుభూతి...

గుట్టల నుంచి వచ్చే వరద నీటిని దాటేందుకు కర్రల తో వంతెన నిర్మించారు. వెదురు కర్రలతో స్వాగత తోరణం, గ్రావెల్ రోడ్డును ఏర్పాటు చేశారు. సుమారు రెండు నెలల క్రితమే ఈ క్యాంపింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ట్రెక్కింగ్.. రాక్ క్లైంబింగ్

పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, నైట్ క్యాంపింగ్, లాంతర్లతో రాత్రి విహారం, తెల్లవారుజామున పక్షులను వీక్షించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జూన్‌లో 140 మంది, జూలైలో 45 మంది విద్యార్థులు ఇక్కడ బస చేసి ట్రెక్కింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో విద్యార్థి నుంచి రోజుకు రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. సుమారు 200 మంది వరకు బస చేసేలా వసతులు కల్పించారు. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ కోసం సీనియర్ కోచ్‌ల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భద్రత కోసం హెల్మెట్లు, తాళ్లు, షూ తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు.

ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు

పాండవుల గుట్టల్లో రాత్రి బస చేయాలనుకునే వారు ఎకో టూరిజం ద్వారా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనంత హైఎక్స్ ఏజెన్సీ సహకారంతో విద్యార్థులను గుర్తించి రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ద్వంసకుంటలో బోటింగ్‌కు సన్నాహాలు

పాండవుల గుట్టల్లో పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు ద్వంసకుంటలో సింగిల్ బోటింగ్ (కయాకింగ్) ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే పాండవుల గుట్టల అభివృద్ధికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ.10 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పాండవుల గుట్టలు, గణపసముద్రం, నాపాక, కోటంచ క్షేత్రాలను కలిపి పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

 నాగపురి శ్రీనివాస్‌గౌడ్, భూపాలపల్లి, (విజయక్రాంతి)

మరిన్ని వార్తలు