గుట్టలు ధ్వంసం.. రోడ్లు ఛిద్రం..

06-10-2026 | 07:13pm
  1. దుమ్ముతో పంటలకు నష్టం
  2. అక్రమంగా మట్టి తవ్వకాలు..
  3. మట్టి తవ్వకాల్లో జేసీబీ డ్రైవర్ మృతి
  4. వెన్నవల్లి గుట్టల్లో ప్రమాదంతో వెలుగులోకి అక్రమ తవ్వకాల ఆరోపణలు
  5. అనుమతులపై అధికారుల వివరణ కోరుతున్న గ్రామస్థులు
  6. ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్

కల్లూరు (విజయక్రాంతి): కల్లూరు మండలం(Kalluru Mandal)లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి.. గుట్టలను ధ్వంసం చేస్తున్నారు.. రోడ్లన్ని చింద్రం అవుతున్నాయి.. దుమ్మెత్తి పంటలపై వెదజల్లుతుంది.. తద్వారా పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఇంతా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.. 

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వెన్నవల్లి గ్రామ సమీపంలో మట్టి తవ్వకాల సమయంలో గుట్ట చరియలు విరిగిపడటంతో జేసీబీ డ్రైవర్ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో తవ్వకాల అనుమతులు, భద్రతా ప్రమాణాలు, సంబంధిత శాఖల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అనుమతులు ఉన్నాయా?

వెన్నవల్లి పరిసరాల్లో పెద్ద ఎత్తున మట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజూ భారీ వాహనాల్లో మట్టి తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా? తవ్వకాలకు నిర్దేశించిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మైనింగ్, అటవీ, కాలుష్య నియంత్రణ తదితర శాఖలు తవ్వకాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నాయో అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

ధ్వంసమవుతున్న గుట్టలు

అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉంటే వాటిపై అధికారులు సమగ్రంగా పరిశీలించాలి. గుట్టలను విచ్చలవిడిగా తవ్వడం వల్ల భూభాగ స్వరూపం మారడంతో పాటు పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వాహనాలతో రోడ్లకు నష్టం

మట్టి తరలించే భారీ వాహనాల రాకపోకలతో గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. వాహనాలు తిరిగే సమయంలో ఎగిసే దుమ్ము, ధూళితో పంట పొలాలు, ఇళ్ల పరిసరాలు ప్రభావితమవుతున్నాయని వాపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వన్యప్రాణుల సంరక్షణపై ఆందోళన

గుట్టల ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగితే అక్కడి వృక్ష సంపద, వన్యప్రాణుల ఆవాసాలపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని కోరుతున్నారు.

ప్రమాదంపై సమగ్ర విచారణకు డిమాండ్

జేసీబీ డ్రైవర్ మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు పాటించారా? ప్రమాదానికి కారణాలేమిటి? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అక్రమ తవ్వకాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మట్టి తవ్వకాల పేరుతో పర్యావరణానికి నష్టం కలగకుండా, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు