దుర్షెడ్ 220 కేవీ సబ్ స్టేషన్‌ను సందర్శించిన టిజిఎన్పీడీసీఎల్ సీఎండీ

11-09-2026 | 08:56pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రంలో నిరంతరాయంగా , నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో  టిజిఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి కరీంనగర్ జిల్లా(Karimnagar District)లోని 220 కేవీ దుర్షెడ్ సబ్ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సబ్ స్టేషన్‌లోని లోడ్ పరిస్థితిని, విద్యుత్ ప్రసార తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నమ్మకమైన  సరైన వోల్టేజ్ స్థాయిలతో కూడిన విద్యుత్ సరఫరాను అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.ట్రాన్స్‌కో అధికారులు మరియు ఇంజనీర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, గ్రిడ్ భద్రతను కాపాడుతూ, విద్యుత్ సరఫరాలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎండీ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని, ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ట్రాన్స్‌కో ఎస్ ఈ శ్రీనివాసు, కరీంనగర్ ఎస్ఈ  ఏ.  విజేయేందర్ రెడ్డి , డి ఈ టెక్నికల్ ఉపేందర్,  డి.ఈ ఆపరేషన్ రాజాం, ట్రాన్సకో అధికారులు, ఎన్పీడీసీఎల్ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు