మహిళలు, బాలికల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు
మల్కాజిగిరి డిసిపి ఉషారాణి (ఉమెన్ సేఫ్టీ)
ఘట్ కేసర్,(విజయక్రాంతి): మహిళలు, బాలికల సంరక్షణ కోసం తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మల్కాజిగిరి డిసిపి ఉషారాణి (Malkajgiri DCP Usharani) అన్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి కమిషనరేట్, ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని అంకుశాపూర్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల(MJPTBCWREIS), కళాశాల ఆవరణలో శుక్రవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో "మీ సురక్ష - ధీర" చైతన్య కార్యక్రమం(Mee Suraksha - Dheera Awareness Program) నిర్వహించారు. విద్యార్థినుల భద్రత, సైబర్ నేరాల పట్ల అవగాహన, అత్యవసర సమయాల్లో ఆత్మరక్షణ చర్యలపై స్పష్టత నిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నమల్కాజిగిరి డిసిపి ఉషారాణి (ఉమెన్ సేఫ్టీ) మాట్లాడుతూ... మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా షీ టీమ్స్ లేదా 100, 112 నంబర్లకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ బుల్లేయింగ్, అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్‌లు, కాల్స్ పట్ల ఎలా మెలిగాలో సమగ్రంగా వివరించారు.
అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ధీరత్వంతో ఎదుర్కొనేందుకు వీలుగా మానసిక ధైర్యాన్ని నూరిపోశారు. స్వయం రక్షణ, పోలీసు సేవలను సద్వినియోగం చేసుకునే విధానాన్ని తెలియజేశారు. అత్యవసర సమయాల్లో హాక్‌ఐ' పోలీసు అత్యవసర సేవల యాప్‌ల ద్వారా తక్షణ సహాయం ఎలా పొందాలో విద్యార్థులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యార్థినులు ఎలాంటి సమస్య వచ్చినా దాచకుండా ధైర్యంగా పోలీసుల సహాయం తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు.
ఈకార్యక్రమంలో ఘట్‌కేసర్ సీఐ బాలస్వామి, ఎస్సై శేఖర్, షీ టీం ఇన్ స్పెక్టర్ రజిత రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్స్ లక్ష్మి, రేణుక, షీ టీమ్ ప్రతినిధులు, పాఠశాల, కళాశాల అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యార్థినులు ఎలాంటి సమస్య వచ్చినా దాచకుండా ధైర్యంగా పోలీసుల సహాయం తీసుకోవాలని అధికారులు ఈసందర్భంగా కోరారు.