అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది
చేగుంటలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
చేగుంట,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని చేగుంట ఎంపీడీఓ చిన్న రెడ్డి, విద్యాధికారి నీరజ అన్నారు. ఇటీవల సెప్టెంబర్ 5న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల ఉత్తమ ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారి నీరజ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం గర్వకారణమని, ఉపాధ్యాయులు అందించిన సేవలకు లభించిన గుర్తింపుగా ఈ పురస్కారాలను భావించాలని అన్నారు. అవార్డులతో ఉపాధ్యాయులపై బాధ్యత మరింత పెరుగుతుందని, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.
విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఉపాధ్యాయుల నిజమైన విజయమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సన్మానానికి స్పందించిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమకు లభించిన అవార్డు సన్మానం మరింత బాధ్యతను పెంచిందన్నారు. తమ సేవలను గుర్తించి గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ ప్రోత్సాహం విద్యార్థుల కోసం మరింత అంకితభావంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.