ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
కరీంనగర్ సిటీ నవంబర్ 11 (విజయక్రాంతి): దేశ విద్యాభివృద్ధికి, జాతీయ సమైక్యతకు ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్(Congress State Spokesperson Siraj Hussain). కరీంనగర్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ జలాలుద్దీన్ అక్బర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆజాద్ పోషించిన కీలక పాత్ర, దేశ విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. మతసామరస్యం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిరాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యంగా పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగానికి బలమైన పునాదులు వేశారని, విద్య ప్రతి ఒక్కరి హక్కు అనే భావనతో ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు విశేష కృషి చేశారని తెలిపారు.
హిందూ, ముస్లిం ఐక్యతతో పాటు భిన్నత్వంలో ఏకత్వం కోసం ఆజాద్ చేసిన కృషి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. యువత ఆయన జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక సేవ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మైనారిటీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని ఆజాద్‌కు ఘనంగా నివాళులర్పించారు.