సంపూర్ణ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు సాగాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ
భూపాలపల్లి టౌన్, నవంబర్ 11 ( విజయ క్రాంతి ) : సంపూర్ణ రాజ్యాధికారమే(Absolute sovereignty) ధ్యేయంగా బీసీలు అంతా ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) రాష్ట్ర అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు పైడిపల్లి రమేష్ ఆధ్వర్యంలో “బీసీల ఆత్మగౌరవం, బీసీ రాజ్యాధికారం” అనే నినాదంతో బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ రాజకీయ నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎర్రం సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కాలంటే ప్రతి ఒక్కరు సంఘటితమై హక్కుల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ అవకాశాలు, రాజ్యాధికార సాధన వంటి అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఐక్యతతోనే బీసీలకు రాజకీయంగా తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో భూపాలపల్లిలో పెద్ద ఎత్తున బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కోట రాజబాబు గౌడ్, వంశీకృష్ణ, గడ్డం భాస్కర్, కూనూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.