శ్రీ చైతన్య పాఠశాలకు విద్యాశాఖ నోటీసులు...!

06-10-2026 | 06:59pm
  1. పరీక్షలు, తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు...
  2. పరీక్ష పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? వివరణ ఇవ్వాలని డీఈవో ఆదేశం...

బాన్సువాడ, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో(Sri Chaitanya School) అనుమతులు లేకుండా పరీక్షలు అనే కథనం విజయ క్రాంతిలో ప్రచురితమైన కథనానికి  మంగళ వారం జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్(District Educational Officer Mallikarjun) నోటీసులు జారీ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు విజయ క్రాంతి తో తెలిపారు.

పాఠశాలలో అనుమతులు, తరగతుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే వివరణ కోరిన నేపథ్యంలో తాజాగా పరీక్షల నిర్వహణపైనా విద్యాశాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.విద్యాశాఖ నుంచి స్పష్టమైన అనుమతులు పొందే వరకు సంబంధిత తరగతులు నిర్వహించవద్దని, అలాగే పరీక్షలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం అనుమతుల వ్యవహారంపై మరోసారి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాఠశాలలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎవరు అందించారు? విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు జారీ అయ్యాయా? లేక పాఠశాల యాజమాన్యమే ప్రశ్నపత్రాలను సిద్ధం చేసిందా? అనే అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించినట్లు సమాచారం.అనుమతుల వ్యవహారం పూర్తిగా తేలకముందే పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశం తెరపైకి రావడంతో విద్యాశాఖ అధికారులు దీనిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యాశాఖ నోటీసులు, పరీక్షల నిర్వహణపై వివరణ కోరడంతో శ్రీ చైతన్య పాఠశాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాఠశాల యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా విద్యాశాఖ అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనుమతులు, తరగతుల నిర్వహణ, పరీక్షల ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు