నకిలీ విత్తనాలు...
- నష్టపోయిన రైతు..
- 80 క్వింటాళ్ల నష్టం...
- పట్టించుకోని అధికారులు....
- పరిహారం అందించాలి...
తాడ్వాయి,అక్టోబర్, 30( విజయ క్రాంతి ): ప్రభుత్వం(Government) నకిలీ విత్తనాలు(spurious seeds),నకిలీ పురుగు మందులు నకిలీ ఎరువులను నిరోధించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఎక్కడో ఒకచోట రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతూనే ఉన్నారు.
రైతులు నష్టపోకుండా ఉండడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నకిలీ విత్తనాలను నిరోధించడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రతీ సంవత్సరం ఖరీఫ్ సీజన్ కు ముందే ఎరువులు, విత్తనాల దుకాణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈ తనిఖీలలో నకిలీ విత్తనాలు ఉన్నట్లయితే సదరు డీలర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.కానీ యధేచ్చగా ఎరువులు,విత్తనాల దుకాణాలలో నకిలీ విత్తనాలు సదరు డీలర్లు విక్రయిస్తూనే ఉన్నారు.
తాజాగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడుపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు నకిలీ విత్తనాలతో నట్టేట మునిగిపోయారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే సదరు రైతు పిట్ల సంజీవులు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ఐదు ఎకరాలలో మొక్కజొన్న పంట వేసుకున్నారు.కానీ నకిలీ విత్తనాల కారణంగా పూర్తిస్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయారు.
సింజెంటా ఎన్ కె 6560 రకం విత్తనాలతో నష్టం...
ఈ సంవత్సరం సదరు రైతు సంజీవులు గతంలో వేసుకున్న విత్తనాలు కాకుండా సింజెంటా ఎన్ కే 6560 రకం విత్తనాలు వేసుకున్నారు. సింజెంటా కంపెనీ ప్రతినిధులు ఈ రకం విత్తనాలు కొత్తగా వచ్చాయి,ఈ విత్తనాలతో మంచి దిగుబడి వస్తుందని రైతుకు నమ్మబలికారు. రైతుకు మరీ నచ్చజెప్పి ఈ విత్తనాలు అందించారు.
ఇదే విషయాన్ని నమ్మిన రైతు గాంధారి మండల కేంద్రంలోని రామకృష్ణ ఫర్టిలైజర్ షాప్ లో విత్తనాలు కొనుగోలు చేశారు. ఒక్కో నాలుగు కేజీల బస్తాను రూ.1250 చొప్పున కొనుగోలు చేశారు.మొత్తం తొమ్మిది బస్తాలు కొనుగోలు చేసి తనకున్న ఐదు ఎకరాల కౌలు భూమిలో పంట సాగు చేశారు.కానీ నకిలీ విత్తనాలు కారణంగా మొక్కజొన్న సజావుగా పెరగలేదు.
ఒక్కో మొక్కజొన్న కర్రకు మూడు నుంచి నాలుగు పిలకలు వచ్చాయి.దీంతో పిలుకలు గట్టి కంకులుగా రూపాంతరం చెందలేదు.కొన్ని కర్రలకు మాత్రమే కంకులు గట్టిగా వచ్చాయి.దీంతో రైతు బోరుమని విలపిస్తున్నారు.ఈ విషయం అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి సంవత్సరం 125 క్వింటాళ్ల దిగుబడి..
ఇదే భూమిలో ప్రతి సంవత్సరం 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని,ఈ సంవత్సరం నకిలీ విత్తనాల కారణంగా పూర్తిగా నష్టపోయానని రైతు వాపోతున్నారు. కేవలం 40 నుంచి 45 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని తెలిపారు.నకిలీ విత్తనాలతో 80 క్వింటాళ్ల దిగుబడిని నష్టపోయానని రైతు తెలిపారు.
నకిలీ విత్తనాలను అరికట్టాలి...
వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు,విత్తనాలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.ఎంతో కష్టపడి వేసుకున్న పంట చేతికి రాకుండా పోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
- నష్టపరిహారం అందించాలి..
- పిట్ల సంజీవులు, రైతు, కరడుపల్లి
తాను సింజెంటా ఎన్ కె 6560 రకం విత్తనాలతో పూర్తిగా నష్టపోయాను.ప్రతి సంవత్సరం ఇదే భూమిలో 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది.కానీ ఈ సంవత్సరం నేను వేసుకున్న సింజెంటా నకిలీ విత్తనాల కారణంగా 80 క్వింటాళ్ల దిగుబడి నష్టపోయాను.వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.తాను ఐదు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పంట సాగు చేశాను.తనకు జరిగిన నష్టం మరో రైతుకు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.