వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): వయోవృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీలో వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం(Welfare of the Elderly), రక్షణ, గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ–సంక్షేమ చట్టం–2007(Maintenance and Welfare of Parents and Senior Citizens Act)పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వయోవృద్ధులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు(Health check ups) చేయించుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వారోత్సవాల్లో హక్కులు, ఆరోగ్యం, భద్రత, సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జి. మల్లేశ్వరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, అర్జున్, కొలగూరి సంజీవరావు, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.