ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి
భూపాలపల్లి ఏరియా పర్యటనలో ప్రాజెక్ట్స్, ప్లానింగ్ డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు
భూపాలపల్లి టౌన్ (విజయక్రాంతి): నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ప్రాజెక్ట్స్, ప్లానింగ్ డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు(Koppula Venkateswarlu) అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటణకు విచ్చేయగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి వారికి స్వాగతం పలికారు.
అనంతరం వారు జీఎంతో కలిసి కేటీకే ఓసీపీ 2, 3 ఉపరితల గనులను సందర్శించారు. అనంతరం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఏరియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరియాలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అందుబాటులో ఉన్న మానవ వనరులు, యంత్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించుకోవాలని అన్నారు.
అదేవిధంగా భవిష్యత్ ఉత్పత్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గనుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సేఫ్టీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం రామన్ వి పాఠక్, ఓసీపీ 2, 3 పీఓలు డి శ్యాంసుందర్, రామస్వామి, సివిల్ ఏజీఎం రవికుమార్, ఈ, ఎం ఏజీఎం సాంబశివరావు, ఫైనాన్స్ డీజీఎం, రాజేశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, సెక్యూరిటి ఆఫీసర్ వీరారెడ్డి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు.