ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఆదికవి వాల్మీకి మహర్షి
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి(Valmiki Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రామాయణాన్ని రచించి ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి చరిత్ర చిరస్మరణీయమని అన్నారు. ప్రపంచం ఉన్నంతకాలం రామాయణం, వాల్మీకి మహర్షి చరిత్ర ప్రజలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు . భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి విశిష్టమైన స్థానం ఉందని, మహాభారతం కూడా మరో గొప్ప ఇతిహాసమని తెలిపారు.
వాల్మీకి మహర్షి జీవిత ప్రయాణం, ఆయన సాధించిన పరివర్తన ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ అన్నారు. ఆయన రచనల ద్వారా ప్రేరణ పొంది అనేక మంది కవులుగా, రచయితలుగా ఎదిగారని అన్నారు . మన గొప్ప ఇతిహాసాల్లోని నీతి, ధర్మం, మానవీయ విలువలను నేటి తరానికి, ముఖ్యంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా యువతలో స్ఫూర్తి, మంచి ఆలోచనలు, నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు.
వాల్మీకి మహర్షి వంటి మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, బీసీ సంఘాల నాయకులు నందకిషోర్, సాంబయ్య, శ్రీనివాసు, రాంబాబు, బి.శ్రీనివాస్, మాధురి, జయశ్రీ, జమలపురం సత్యనారాయణ, డి.సత్యనారాయణ, రమేష్, జయమ్మ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.