అధ్వాన్నంగా జువ్వాడి రోడ్డు
వెంటనే మరమ్మతులు చేయాలి
రెండు మండలాల ప్రజల వేడుకోలు
తాడ్వాయి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలలోని రోడ్లు అద్వానంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.రోడ్లు గుంతలమయమై అద్వానంగా మారడంతో అవస్థలు పడుతున్నారు. జువ్వాడి రోడ్డు రెండు మండలాల ప్రజలను కలుపుతూ దూర భారాన్ని తగ్గిస్తుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడుపల్లి, జనగాం రోడ్డు నుంచి జువ్వడి గ్రామం వరకు రోడ్డు అద్వానంగా మారింది.
అడుగడుగునా గుంతలు ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయమై తాము ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కరడుపల్లి గ్రామం నుంచి జువాడి గ్రామం వరకు ఉన్న మూడు కిలోమీటర్ల రోడ్డు గుంతలు ఏర్పడి అద్వానంగా మారింది.వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలని కోరుతున్నారు.
దూర భారం తగ్గుతుంది..
తాడువాయి మండలం కరడు పల్లి గ్రామం నుంచి గాంధారి మండలం కేంద్రానికి చేరుకోవాలంటే ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్తే పూర్తిగా దూర భారం తగ్గుతుంది. తాడ్వాయి మండలంలోని దేమికలాన్, కరడుపల్లి,ఎర్రపహాడ్ గ్రామాల ప్రజలు గాంధారి మండలానికి వెళ్లాలంటే జనగాం, లింగంపల్లి గ్రామాలమీదుగా వెళితే దూర భారం పెరుగుతుంది.15 కిలోమీటర్ల దూరం ఎక్కువ అవుతుంది.
కరడుపల్లి నుంచి జువ్వాడి వరకు రోడ్డు మార్గాన్ని బాగు చేస్తే ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. గాంధారి మండలానికి చెందిన ప్రజలు సైతం జిల్లా కేంద్రమైన కామారెడ్డికి చేరుకోవాలంటే ఈ రోడ్డు ద్వారా వెళ్తే గాంధారి మండల ప్రజలకు దూరం తగ్గుతుంది.ఇంత సౌకర్యవంతంగా ఉన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని గాంధారి, తాడ్వాయి మండలాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.
వెంటనే నిధులు మంజూరు చేయాలి..
గుంతలమయంగా ఉన్న జువ్వాడి రోడ్డును బాగు చేయడం కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని కరడుపల్లి,జువ్వాడి మాధవ్ పల్లి,గాంధారి గ్రామాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.ఈ రోడ్డు గుంతల మయమై అద్వానంగా ఉండడంతో ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.