కల్మలచెరువులో నూతన సహకార సంఘం ఏర్పాటు చేయాలి

23-11-2026 | 08:46pm

11 గ్రామాలను కలుపుతూ పాత సొసైటీని పునరుద్ధరించాలి

లంబాడ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు గుగులోతు సందీప్ నాయక్

గరిడేపల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం సహకార సంఘం పరిధిలో ఉన్న కల్మలచెరువు గ్రామంలో ఉన్న పాత సొసైటీని పునరుద్ధరించి, నూతన సహకార సంఘంగా ఏర్పాటు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు గుగులోతు సందీప్ నాయక్(Sandeep Naik) కోరారు. సోమవారం రైతులతో మాట్లాడుతూ ఆయన ఈ డిమాండ్‌ను వెల్లడించారు.

కల్మలచెరువును హెడ్‌క్వార్టర్‌గా ఏర్పాటు చేసి, దాని పరిధిలో కల్మలచెరువు, చౌవారిగూడెం, శీతల తండా, లుంబ తండా, సోమ్లా తండా, గంగానగర్, చంద్రయ్యగూడెం, గారకుంట తండా, పరెడ్డిగూడెం, గానుగుబండ, కొండాయిగూడెం గ్రామాలను కలుపుతూ నూతన సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నూతన సొసైటీ ఏర్పాటుతో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు, డెయిరీ రుణాలు, ఎల్‌టీ రుణాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ డిమాండ్ సాధన కోసం సంబంధిత గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయించి, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతులందరినీ సమన్వయం చేసుకొని కల్మలచెరువును నూతన సహకార సంఘంగా ఏర్పాటు చేసే వరకు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బానోతు పులియా నాయక్, నీటి సంఘం మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్రాం నాయక్, గ్రామ సామాజిక సేవకులు నరేందర్ నాయక్, చాంప్లా నాయక్, రాములు నాయక్, భగవాన్ నాయక్, కాలా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు