108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ
సిబ్బందికి కీలక సూచనలు చేసిన జిల్లా సమన్వయకర్త
గుండాల,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) 108 సమన్వయకర్త సతీష్ గురువారం మండల కేంద్రంలోని 108, 102 అంబులెన్స్ వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న రెండు 108లతో పాటు 102 వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా 108 వాహనాల్లోని అత్యవసర వైద్య పరికరాలు, మందుల నిల్వలు, వాహనాల నిర్వహణ రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడిన ఆయన అత్యవసర సమయాల్లో బాధితులకు సత్వరమే స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండటంతో పాటు వాహనాల్లోని వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచనలు, సలహాలు అందించారు. ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సతీష్ సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో 108 ఈఎంటీలు కుంజ నాగేశ్వరరావు, భాస్కర్, పైలట్స్ దేవా, సాయి, 102 కెప్టెన్ విజయ్ పాల్గొన్నారు.