స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండల(Mulakalapalli Mandal) కేంద్రంలో బుధవారం జరిగిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత,అవమానకర వ్యాఖ్యలను భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి, ములకలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యండి జహీరుద్దీన్ తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్(BRS) నాయకులు రాజకీయ విమర్శల పేరుతో హద్దులు దాటి మాట్లాడటం వారి అహంకారానికి, రాజకీయ అసహనానికి పరాకాష్ట అని వారు మండిపడ్డారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. “పదవికి గౌరవం ఇవ్వడం చేతకాకపోతే కనీసం ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి” అని బీఆర్‌ఎస్ నాయకులకు హితవు పలికారు. అధికారం కోల్పోయిన బాధతో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి రాజకీయ పతనానికి నిదర్శనమని విమర్శించారు. దళిత నాయకుడిని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రతి అనుచిత వ్యాఖ్యకు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల మధ్యనే గట్టి సమాధానం చెబుతామని అన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar)కు, దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ నాయకుల అసలు రాజకీయ స్వరూపాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్పిస్తామని హెచ్చరించారు.“దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే మాటలను సహించేది లేదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తుంది.” అన్నారు.