గిరిజన యువత ఉద్యోగ హక్కుల పరిరక్షణకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం..

18-09-2026 | 07:26pm

ఉట్నూర్, సెప్టెంబర్ 18 ( విజయక్రాంతి): ఏజెన్సీ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన యువత ఉద్యోగ హక్కులను పరిరక్షించడంతో పాటు పోలీస్ నియామకాల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar)తో పాటు ఖానాపూర్ శాసనసభ్యులు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రాందాస్ మాలోత్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ప్రధానంగా గిరిజన యువత ఉద్యోగ హక్కుల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక గిరిజన యువతకు పోలీస్ శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో గతంలో అమల్లో ఉన్న 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను పునరుద్ధరించి, 2026 పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

గతంలో అమల్లో ఉన్న G.O.Ms.No.109, తేదీ 17.06.1988 మరియు గెజిట్ నోటిఫికేషన్ No.49, తేదీ 10.05.2018 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక గిరిజనులకు కల్పించిన 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను పునఃపరిశీలించి అమలు చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  విజ్ఞప్తి చేశారు. 2022లో జరిగిన సివిల్ కానిస్టేబుల్ నియామకాల్లోనూ ఈ ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీ ప్రాంతాల స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాల్లో కల్పించిన ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు కూడా ఉద్యోగాల్లో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుత పోలీస్ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన స్థానిక గిరిజన యువతకు 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వినతిపత్రంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించి, ఏజెన్సీ ప్రాంతాల స్థానిక గిరిజన యువత ఉద్యోగ హక్కుల అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు