ఫలించిన ఎమ్మెల్యే కృషి
రూ.50 కోట్లతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం మంజూరు...
ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు రూ.50 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిమ్స్ పై ఆదిలాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన గిరిజన, గ్రామీణ, పేద కుటుంబాలు కూడా వైద్య సేవల కోసం ఆధారపడుతున్నాయి.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, నవజాత శిశువులకు ప్రత్యేక వైద్య సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మాతా శిశు వైద్య సేవలు సాధారణ ఆసుపత్రి భవనంలోనే కొనసాగుతుండటంతో పడకలు, వసతుల కొరత ఏర్పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి ప్రత్యేకంగా లేఖ రాసి, రిమ్స్ ఆదిలాబాద్‌లో ప్రత్యేక మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంజూరు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం కేంద్రం ఏర్పాటుకు రూ.50 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.