గొర్రెల మందపై దూసుకెళ్లిన రైలు

29-09-2026 | 04:02pm

బాధిత గొర్రెల కాపరులను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి

ఆలేరు, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల(Bibi-nagar–Ghatkesar railway stations) మధ్య కొండమడుగు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కలు, అడవి పందులు బెదిరించడంతో భయపడిన సుమారు 600 గొర్రెల మంద రైల్వే ట్రాక్‌పైకి రావడంతో అదే సమయంలో అటుగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో సుమారు 600 గొర్రెలు మృతి చెందాయి. పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కిష్టయ్య (కృష్ణయ్య)కు చెందిన గొర్రెలు మృతి చెందడంతో సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. జీవనోపాధిగా పెంచుకుంటున్న గొర్రెలన్నీ ఒక్కసారిగా మృతి చెందడంతో బాధితుడు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

బాధితులను పరామర్శించిన బీర్ల ఐలయ్య

విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును స్థానికులు, బాధిత రైతును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కుంభం అనిల్‌కుమార్ రెడ్డి

ఈ ఘటనపై స్పందించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకుని బాధిత గొర్రెల కాపరిని పరామర్శించారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్, సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పంచనామా నిర్వహించి నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశం

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను తెలియజేశారు. వెంటనే పంచనామా నిర్వహించి గొర్రెల మృతిపై నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు