హాస్టల్ లో వసతులు మెరుగ్గా ఉండాలి

29-09-2026 | 04:10pm
  1. విద్యార్థులు అన్నీ సబ్జెక్ట్ ల మీద దృష్టి పెట్టాలి
  2. స్పెషల్ ఆఫీసర్ దీప పని తీరుపై కలెక్టర్ అసహనం

హనుమకొండ, సెప్టెంబర్ 29(విజయ క్రాంతి):హాస్టల్ లో విద్యార్థులకు మెరుగైన వసతులు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(District Collector Chahat Bajpai) అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ లష్కర్  బజారు లోని అర్బన్  రెసెడెన్షియల్ స్కూల్ ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలోని  కిచెన్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థులకు అందించేందుకు తయారు చేస్తున్న వంట పదార్థాలను పరిశీలించారు. అలాగే వంట గదిలోని నిత్యావసరాలు,  కూరగాయలను పరిశీలించారు. అనంతరం 5, 6వ తరగతి విద్యార్థుల దగ్గరికి వెళ్లి ఈ రోజు పెట్టిన బ్రేక్ ఫాస్ట్ గురించి ఆరా తీశారు.స్నాక్స్, గుడ్లు పెడుతున్నారా అని,

అలాగే టీచర్స్ వస్తున్నారా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులకు సంబంధించి వివరాలను విద్యార్థులను అడిగి  వారి అభ్యసన సామర్ధ్యాలను కలెక్టర్ పరిశీలించారు.

మెనూ ప్రకారం భోజనం తయారు చేయనందుకు, అలాగే క్లాస్ రూమ్ లో ఫ్యాన్ రిపేర్ చేయించనందుకు హాస్టల్ స్పెషల్ ఆఫీసర్ దీప ను కలెక్టర్ మందలించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి  మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు.  ప్రతి పూట నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

వంట తయారీలో నాణ్యమైన నిత్యావసర వస్తువులను, తాజా కూరగాయలను వినియోగించాలన్నారు. విద్యార్థులకు అందించే టిఫిన్, స్నాక్స్, లంచ్, డిన్నర్ ఏ సమయం లో పెట్టాల్సిన వాటిని సమయానుకూలంగా పెట్టాలని తెలిపారు.

విద్యార్థులకు అందించే భోజన పదార్థాలు నాణ్యతగా, పరిశుభ్ర వాతావరణంలో అందించాలన్నారు. తరగతి గదులు అన్ని కూడా పరిశుభ్రంగా, విద్యార్థులకు అనుకూలమైనవిగా ఉండాలన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఈ దశలో నేర్చుకున్నవి భవిష్యత్ జీవితంలో స్థిరపడడానికి దోహద పడుతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా పని చేస్తే చర్యలు తప్పవని స్పెషల్ ఆఫీసర్ దీప ని కలెక్టర్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు