షాదీఖానా స్థల కేటాయింపు పత్రం అందజేసిన ఎమ్మెల్యే
హనుమకొండ, సెప్టెంబర్ 29(విజయ క్రాంతి): ముస్లిం మైనార్టీలకు షాదీఖానా(shadikhana ) నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా 0.25 గుంటల స్థల కేటాయింపు పత్రాన్ని మత పెద్దలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) అందజేశారు. మంగళవారం మైనార్టీ మత పెద్దలు, పెద్దల సమక్షంలో కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో షాదీఖానా నిర్మాణం కోసం ఒక స్థలాన్ని కేటాయించినప్పటికీ, ఆ స్థల పరిస్థితులు, భవిష్యత్తులో నిర్మాణానికి ఎదురయ్యే ఇబ్బందులను అధికారులు పరిశీలించారని తెలిపారు. గతంలో ఆ ప్రాంతంలో భద్రకాళి అమ్మవారి మట్టి తీసుకువచ్చి స్థలాన్ని పూడ్చడం జరిగిందని, అక్కడ నిర్మాణం చేపడితే భవనం పునాదులు కుంగిపోయే అవకాశం ఉందన్న సాంకేతిక అంశాలను అధికారులు గుర్తించారని వివరించారు.
మైనార్టీలకు మంచి వసతులతో షాదీఖానా నిర్మించాలన్న ఉద్దేశంతోనే పాత స్థలానికి ప్రత్యామ్నాయంగా మరింత అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే మత పెద్దలు, స్థానిక పెద్దలతో కలిసి స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, రహదారి సౌకర్యం, స్థల పరిస్థితులు, భవిష్యత్ నిర్మాణానికి అనుకూలత వంటి అంశాలను వారికి స్వయంగా వివరించామని చెప్పారు.
మైనార్టీల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోందని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. షాదీఖానా నిర్మాణంతో ముస్లిం మైనార్టీ కుటుంబాలకు వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజీపేట దర్గా పీఠాధిపతి కుసురు పాషా,
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ అజిత్ ఉల్లా,మాజీ కార్పొరేటర్లు అబూబకర్,నసీం జాన్,విజయశ్రీ రాజాలీ,నాయకులు అంకుస్,బాబాయ్,ముజాహిద్,సమీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.