ఆ పోలీసులెవరో తేల్చండి!

29-09-2026 | 12:15pm

హైదారబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వ్యవహారశైలిపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు(High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిని గుర్తించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించి, బాధ్యులుగా తేలిన పోలీసులపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని సూచించింది.

పోలీసులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను అసెంబ్లీ స్పీకర్‌(Assembly Speaker) ముందు ఉంచాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రజాప్రతినిధులతో పోలీసులు వ్యవహరించే విధానం, వారికి ఉన్న అధికారాలపై కూడా విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ సభ్యులను సభలోకి వెళ్లకుండా అడ్డుకునే విషయంలో పోలీసుల పాత్ర, అధికార పరిధిపై స్పష్టత అవసరమని పేర్కొంది.

అయితే పోలీసులు స్పీకర్‌ ఆదేశాల మేరకు మాత్రమే వ్యవహరించి ఉంటే, ఆ వ్యవహారం స్పీకర్‌ అధికార పరిధిలోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించిన పోలీసుల చర్యలు, వాటికి దారితీసిన పరిస్థితులు, బాధ్యత వహించిన అధికారుల వివరాలను పరిశీలించాలని సూచించింది. ఈ వ్యవహారంలో డీజీపీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు